హైదరాబాద్: ఈ నెల 21న నీట్-యూజీ (NEET-UG 2026) రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ‘మెసేజ్ ఎడిట్’ ఆప్షన్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసారు . నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ విద్యార్థులను మోసం చేస్తున్న పలు టెలిగ్రామ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపారు. అలాగే టెలిగ్రామ్‌లో ఈనెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పాక్షికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నీట్-యూజీ ప్రశ్నపత్రాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని కేంద్రం చెబుతోంది. ఐ4సీ (I4C), ఐటీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని సూచించారు. ఎవరైనా లీకేజీల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ‘cybercrime.gov.in’ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎనిమిది టెలిగ్రామ్ ఛానెల్స్ నడుపుతూ కోటిన్నర రూపాయల విలువైన ఒక అంతర్రాష్ట్ర ముఠాను అహ్మదాబాద్‌లో ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు నీట్ మోసాలపై అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ, బిహార్ పోలీస్ ఎనకమిక్ అఫెన్సెస్ వింగ్ కూడా అడ్వైజరీ జారీ చేసింది. టెలిగ్రామ్ సేవల తాత్కాలిక నిలిపివేత వల్ల సాధారణ వినియోగదారులకు కలిగే అసౌకర్యాలకు- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- విచారం వ్యక్తం చేసింది.

జాతీయ పరీక్షల సంస్థ (NTA) సూచనల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఈ ఆదేశాలు జారీ చేసింది. టెలిగ్రామ్‌లో ఒక్కో ఛానల్‌ను తొలగించడం ద్వారా సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించడం లేదని, వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న మోసగాళ్ల నెట్‌వర్క్‌లను అడ్డుకోవడానికి మరింత కఠిన చర్యలు అవసరమని NTA అభిప్రాయపడింది. NTA వెల్లడించిన వివరాల ప్రకారం, “PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia” వంటి పేర్లతో నడుస్తున్న పలు టెలిగ్రామ్ ఛానళ్లు విద్యార్థులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. అసలు ప్రశ్నాపత్రం తమ వద్ద ఉందంటూ కొందరు అభ్యర్థుల నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే పరీక్ష ప్రశ్నాపత్రం పూర్తిగా భద్రతా వ్యవస్థలోనే ఉంటుందని, పరీక్షకు ముందు ఎవరూ దానిని పొందే అవకాశం లేదని NTA స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తలు తప్పుడు సమాచారం అని తెలిపారు.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా మధ్యవర్తిత్వ చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో టెలిగ్రామ్‌పై తాత్కాలిక పరిమితులు విధించడం చివరి మార్గంగా NTA తెలిపింది. పరీక్షల విశ్వసనీయతను కాపాడడం, అభ్యర్థులను మోసాల నుంచి రక్షించడం, మరియు తప్పుడు సమాచారాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలియజేసారు.









