టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన సేవా కార్యక్రమాలతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల తన పెళ్లి రిసెప్షన్ సందర్భంగా సొంత గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తానని ప్రకటించిన విజయ్.. ఇప్పుడు ఆ మాటను కార్యరూపంలో చూపించారు.ఇక విజయ్ దేవరకొండ తన భార్య రష్మికతో కలిసి స్వగ్రామమైన తుమ్మన్పేటను సందర్శించారు. గ్రామస్థుల మధ్య ఎంతో ఆప్యాయంగా గడిపిన ఆయన, ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి టాపర్ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు.
మొత్తం 45 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను విజయ్, రష్మిక స్వయంగా అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరనే నమ్మకాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీగా హాజరయ్యారు. తమ గ్రామానికి చెందిన హీరో ఇలా తిరిగి వచ్చి పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేయడం గర్వకారణమని పలువురు గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా విజయ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
అయితే సేవా కార్యక్రమంతో పాటు స్టేజ్‌పై విజయ్, రష్మిక మధ్య జరిగిన కొన్ని మధుర క్షణాలు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. విద్యార్థులకు చెక్కులు అందజేస్తున్న సమయంలో వేడి కారణంగా విజయ్‌కు చెమట పట్టగా, రష్మిక ప్రేమగా తుడిచిన వీడియో వైరల్‌గా మారింది. అంతేకాకుండా సరదాగా విజయ్ మీసాన్ని మెలేయడం కూడా అభిమానులను ఆకట్టుకుంది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు “క్యూటెస్ట్ కపుల్”, “మేడ్ ఫర్ ఈచ్ అదర్”, “సేవతో పాటు ప్రేమను కూడా పంచుతున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్-రష్మిక జంటపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం వంటి అనేక రంగాల్లో ఫౌండేషన్ ద్వారా మద్దతు అందిస్తున్నారు. ఇప్పుడు స్వగ్రామ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం ద్వారా మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.





