తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. వేసవి రద్దీ దాదాపు ముగిసినట్లే. రద్దీ సమయంలోనూ భక్తులకు దర్శనంలో ఇబ్బంది లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను అరికట్టడానికి టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. కొండపైకి వచ్చే వాహనాల నియంత్రణ, భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

తిరుమలలో భక్తులకు ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే విధంగా టీటీడీ కొత్త ప్రణాళికలను సిద్దం చేస్తోంది. నిత్యం తిరుమల కొండ పైకి దాదాపు వెయ్యి దాకా వాహనాలు వస్తున్నాయి. ముందుగా వసతి పొందేందుకు సీఆర్వో, శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద పార్కింగ్ చేస్తున్నారు. ఈ ప్రదేశం సరిపోక.. రోడ్ల పైనా పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు సమస్యగా మారుతోంది. అదే విధంగా ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలు మరో నాలుగు వేల వరకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద పార్కింగ్ లేకపోవడంతో రోడ్ల పైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో.. రద్దీ సమయాల్లో ఈ వాహనాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, తాజాగా అలిపిరి వద్దే పార్కింగ్ సదుపాయం కల్పించటం పైన టీటీడీ ఫోకస్ చేసింది. ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులనే కొండ పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేసి.. భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

తిరుమలలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. గతంలో తిరుమలలో 2 మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటైన పీఏసీ-5 ప్రాంతాన్ని యాత్రికుల వసతి సముదాయంగా మార్చివేశారు. దీంతో తాజాగా ముళ్లగుంతలో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాల పైన అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తే భక్తులకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఆలయానికి, సీఆర్వోకు చేరుకొనేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 3 వేల వాహనాలకు చోటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యం ద్వారా సమస్య కొంత వరకు పరిష్కారం చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *