(PART-2)
ఓఎన్‌జీసీ టెండర్ల కుంభకోణం: ఆరోపణలు, విచారణ
ప్రధాన ఆరోపణలు:
టెండర్ ప్రక్రియలో ఓఎన్‌జీసీకి చెందిన అంతర్గత బెంచ్‌మార్క్ (IBM) విలువను అస్మదీయ కంపెనీలకు ముందుగానే లీక్ చేశారని ఆరోపణలున్నాయి.
దీని ద్వారా సుమారు 114 కోట్ల మేర ఓఎన్‌జీసీకి నష్టం వాటిల్లేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
కంపెనీల సామర్థ్యంపై అనుమానాలు:
ఓఎన్‌జీసీ నుంచి టెండర్లు దక్కించుకున్న కంపెనీల సామర్థ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీఎండీసీ నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి ఏడాదికి పరిమిత పరిమాణంలోనే బెరైటీస్ కేటాయింపులు చేస్తారు.
అయితే, ఈ కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు తమకు ఉన్న అధికారిక కోటా కంటే వంద రెట్లు ఎక్కువ సరుకును ఎలా సరఫరా చేస్తాయనేది మిలియన్ డాలర్ల
ప్రశ్న….
వివాదానికి మూల కారణం:
మంగంపేట బెరైటీస్ అనేది రాష్ట్రానికి చెందిన విలువైన ఖనిజ సంపద.
కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఏపీఎండీసీ నుంచి తక్కువ పరిమాణంలో సరుకు కొని, ఓఎన్‌జీసీ లాంటి కేంద్ర సంస్థలకు భారీ మొత్తంలో సరఫరా చేస్తున్నట్లు చూపిస్తూ, మధ్యలో సిండికేట్ ద్వారా లాభపడటమే ఈ మొత్తం వివాదానికి మూల కారణంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ స్పందన – విజిలెన్స్ విచారణ:
ఈ వరుస వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా స్పందించింది.
మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ముగ్గురు సభ్యుల బృందం విచారణ మొదలుపెట్టింది.
ఓఎన్‌జీసీ సరఫరా కుంభకోణంపై విజిలెన్స్ విచారణలో ముందుకు వెళుతోంది.
అయితే, ఈ విచారణపై కూడా అనేక అనుమానాలు లేకపోలేదు.
మంగంపేట బెరైటీస్ గనుల వివాదం: ONGC టెండర్లలో అక్రమాలు
మంగంపేట బెరైటీస్ గనులకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు, పల్వరైసింగ్ మిల్లుల ఆందోళన, దేశంలో ప్రతిష్టాత్మకమైన ONGC టెండర్లలో జరుగుతున్న అక్రమాలు మంగంపేట బెరైటీస్ గనులను అడ్డం పెట్టుకుని కొందరు సాగిస్తున్న అక్రమ వ్యాపార వ్యవహారం వెలుగుచూస్తోంది.
ONGC టెండర్ వివాదం – బిడ్ రిగ్గింగ్ ఆరోపణలు :
ఓఎన్‌జీసీ టెండర్ వివాదం అంటే బిడ్ రిగ్గింగ్ విషయంలో అనేక అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఓఎన్‌జీసీకి బెరైటీస్ సరఫరా చేసే టెండర్ల వ్యవహారం చూస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
2026-28 సంవత్సరాలకు గాను 2.82 లక్షల టన్నుల బీ-గ్రేడ్ బెరైటీస్ సరఫరా కోసం ఓఎన్‌జీసీ టెండర్లు పిలిచింది.
ఇందులో పాల్గొన్న కంపెనీలు ఒక సిండికేట్‌గా ఏర్పడి, చాలా తక్కువ తేడాతో బిడ్లు దాఖలు చేశాయన్న ఆరోపణలున్నాయి.
ప్రభుత్వానికి, ONGCకి లేఖలు :
టెండర్లను ఖరారు చేసే ముందు, ఆయా కంపెనీల గత చరిత్ర, అవి కొనుగోలు చేసిన సరుకు పరిమాణం, వాటిని బ్లాక్ లిస్టు చేశారా లేదా వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతూ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అవర శ్రీధర్‌తో పాటు మిల్లుల యజమానులు ప్రభుత్వానికి, టెండర్ పిలిచిన ఓఎన్‌జీసీకి కూడా లేఖలు రాశారు.
మంగంపేట గని – అక్రమాలపై విజిలెన్స్ విచారణ :
“ప్రపంచంలోనే అతిపెద్ద బెరైటీస్ నిక్షేపం మన ఆంధ్రప్రదేశ్ సొంతం. మంగంపేట గని ఒక బంగారు గని. కానీ, ఈ గని నుంచి వెలికితీసే సంపద ప్రభుత్వ ఖజానాకు చేరాల్సింది పోయి, ప్రైవేటు సిండికేట్ల జేబుల్లోకి ఎలా వెళ్తోంది? నిన్నటి వరకు మంగంపేటలో జరిగిన మైనింగ్ మాఫియా, ఇప్పుడు నేరుగా ఓఎన్‌జీసీ వంటి కేంద్ర సంస్థల టెండర్లను ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరింది?” అనేది నిగ్గు తేలాల్సిన అంశం.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ దీనిపై లోతైన విచారణ చేస్తోంది.
అసలు ఓఎన్‌జీసీ టెండర్ దక్కించుకున్న కంపెనీల సామర్థ్యం ఎంత, ఏపీఎండీసీ నుంచి ఎంత మేర బెరైటీస్ ఖనిజాన్ని ఏయే గ్రేడుల ఖనిజాన్ని ఎంత మొత్తంలో కొనుగోలు చేశారు.
వీరు ఎంత మొత్తంలో ఓఎన్‌జీసీకి సరఫరా చేస్తున్నారు, అలాగే జీఎస్టీ బిల్లులు, ఎక్కడ నుంచి ఓఎన్‌జీసీకి ఖనిజాన్ని సరఫరా చేస్తున్నారు అన్న అంశాలపై విజిలెన్స్ కమిటీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టు అధికారులతో విజిలెన్స్ కమిటీ భేటీ అయి, అనేక అంశాలపై సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే విజిలెన్స్ కమిటీ ఈ ఓఎన్‌జీసీ టెండర్ వ్యవహారంలో చోటు చేసుకున్న వందల కోట్ల అవినీతి అక్రమాలను ఎప్పుడు బయట పెడుతుందనేది ప్రధాన చర్చ.
టెండర్ నిబంధనల ఉల్లంఘన, బ్లాక్‌లిస్ట్ కంపెనీలకు కాంట్రాక్టులు :
టెండర్ నిబంధనల ప్రకారం, 2.82 లక్షల టన్నుల సరఫరా సామర్థ్యం ఉండాలి.
కానీ, టెండర్ దక్కించుకున్న మూడు కంపెనీలకు ఏపీఎండీసీతో ఉన్న అధికారిక ఒప్పంద సామర్థ్యం కేవలం 140 మెట్రిక్ టన్నులు మాత్రమే.
ఇలాంటి సంస్థలకు ఏ ప్రాతిపదికన ఓఎన్‌జీసీ భారీ ఆర్డర్లు ఇచ్చిందనేది ఇప్పుడు ఉన్నతాధికారుల పైనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
గతంలో బ్లాక్‌లిస్టులో ఉన్న ‘సుహృత మినరల్స్’ వంటి కంపెనీలకే మళ్లీ కాంట్రాక్టులు దక్కడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, పరిశ్రమ నిపుణులు ప్రధానంగా రెండు అంశాలపై విచారణ కోరుతున్నారు.
గత ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు :
అంతేగాక గతంలో ఏపీఎండీసీ నేరుగా ఓఎన్‌జీసీకి బి-గ్రేడ్ బెరైటీస్ ఖనిజాన్ని సరఫరా చేసి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది.
మరి అలాంటి విధానం రద్దయి, గత ప్రభుత్వ హయాంలో ఏపీఎండీసీ ఓఎన్‌జీసీ టెండర్లలో పాల్గొనకుండా చేశారు.
దీని వెనుక రాజకీయాలు నడిచాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
అక్రమార్కులపై చర్యలు:
మంగంపేట సంపద ఒక తరానికే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా కావాలి.
నిల్వలు అయిపోతున్నాయని తెలిసినా, సిండికేట్లుగా ఏర్పడి అక్రమ మార్గాల్లో లాభాలు గడిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేదెవరు?
విజిలెన్స్ విచారణ కేవలం కాగితాలకే పరిమితమవుతుందా లేక అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందా?
ప్రభుత్వ బాధ్యత:
ఆంధ్రప్రదేశ్ వనరుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేయబోతోంది? అన్నది వేచి చూడాలి.














































