తల్లి కంటతడి… ఒక కుటుంబం బూడిద… ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన నిజం పోలీసులనే కాదు… స్థానికులను కూడా షాక్ కు గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కల్లల్వాడలో ముగ్గురు సజీవ దహనం ఘటన వెనుక ఉన్న అసలు కథ ఏంటి…?
కల్లల్వాడలో విషాదం:
జూన్ 5వ తేదీ అర్ధరాత్రి సమయం. కల్లల్వాడ గ్రామం ప్రశాంతంగా నిద్రలో ఉంది. కానీ ఓ ఇంట్లో మాత్రం క్షణాల్లో మంటలు చెలరేగాయి. చూసే లోపే ఇల్లు అగ్నిగుండంగా మారిపోయింది. స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ అగ్ని కీలల్లో అమ్మమ్మ చంద్రమ్మ, మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణితి సజీవదహనమయ్యారు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.
మలుపు తిరిగిన దర్యాప్తు :
ఘటన జరిగిన వెంటనే ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు కావచ్చని భావించారు. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ ప్రారంభించారు. కానీ మృతుల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల తల్లి దనమ్మ మనసులో మాత్రం అనుమానాలు మొదలయ్యాయి. “ఇది ప్రమాదం కాదు… ఎవరో కావాలనే చేశారు” అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దనమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మలుపు తిరిగింది.
బయటపడిన నిజం :
దర్యాప్తులో పోలీసులు ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ ముందుకెళ్లారు. అనుమానితులను విచారించారు. చివరకు బయటపడిన నిజం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. దనమ్మ రెండో భర్త శిరీష్ కుమార్ తో కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు. భార్యపై పెరిగిన కోపం, కక్ష అతడిని కిరాతకుడిగా మార్చిందని పోలీసులు తేల్చారు. భార్యను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని శిరీష్ కుమార్ ప్లాన్ చేశాడని. అర్ధరాత్రి ఇంటి వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైంది.
అమాయకుల బలి :
అయితే విధి మరో విషాదాన్ని రాసింది. ఆ సమయంలో లక్ష్యంగా పెట్టుకున్న దనమ్మ ఇంట్లో లేకపోవడంతో… లోపల నిద్రిస్తున్న అమ్మమ్మ చంద్రమ్మ, ఇద్దరు చిన్నారులు లక్ష్మణ్, ప్రణీతి మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేక ముగ్గురూ సజీవదహనమయ్యారు. ఒక్కరి మీద ఉన్న కక్ష… ముగ్గురు నిరపరాధుల ప్రాణాలను బలితీసుకుంది.
నిందితుడి అరెస్ట్ :
సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన వివరాల ఆధారంగా శిరీష్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. ప్రమాదంలా కనిపించిన ఈ ఘటన వెనుక పక్క ప్రణాళికతో చేసిన హత్య కుట్ర దాగి ఉందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్ధారించారు. కాగా కిరాతకానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
కోపం క్షణికం… కానీ దాని పరిణామాలు జీవితాంతం వెంటాడుతాయి. భార్యపై పెంచుకున్న ద్వేషం చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ప్రమాదంగా కనిపించిన ఈ అగ్నిప్రమాదం… అసలు చూస్తే ప్రతీకారంతో రగిలిన మనసు రాసిన రక్తచరిత్రగా మారింది.

























