నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు కేంద్రం నిర్ణయం:
2027 జూలై 1 నుంచి దశల వారీగా అమలు నకిలీ, నాణ్యత లేని ఔషధాల చెలామణిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న టీకాలు, కేన్సర్ చికిత్సకు వినియోగించే మందులు, యాంటీబయోటిక్స్, మత్తు పదార్థాలు, సైకోట్రోపిక్ ఔషధాలపై ఇకపై బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ తప్పనిసరి కానుంది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డ్రగ్స్ రూల్స్ -1945లో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు కొద్ది మందులకే పరిమితమైన ‘ట్రాక్ అండ్ ట్రేస్’ వ్యవస్థను మరింత విస్తృత స్థాయిలో అమలు చేయనుంది.
1. ప్రస్తుత పరిస్థితి:
ప్రస్తుతం దేశంలోని టాప్-300 ఫార్మాస్యూటికల్ బ్రాండ్లపై మాత్రమే క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు వ్యవస్థ అమల్లో ఉంది.
2. తాజా నిర్ణయంతో మార్పులు:
అన్ని టీకాలు, అన్ని యాంటీ మైక్రోబియల్ (యాంటీబయోటిక్) మందులు, అన్ని కేన్సర్ మందులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టేన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం-1985 పరిధిలోని ఔషధాలన్నీ షెడ్యూల్ ఏ2 పరిధిలోకి రానున్నాయి.
3. నిర్ణయం వెనుక లక్ష్యం:
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నియంత్రణ. నాణ్యత లేని లేదా నకిలీ యాంటీబయోటిక్స్ వినియోగం వల్ల బ్యాక్టీరియా మందులకు లొంగని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచ ఆరోగ్య రంగానికి ఇది పెద్ద సవాలుగా మారింది.
క్యూఆర్ కోడ్ వ్యవస్థతో నకిలీ యాంటీబయోటిక్స్‌ను గుర్తించడం సులభమవుతుందని, తద్వారా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నియంత్రణకు కూడా ఇది దోహద పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
4. అమలు తేదీలు:
ఔషధ తయారీ సంస్థలకు అవసరమైన సమయం కల్పించేందుకు కేంద్రం ఈ నిబంధనలను దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది. టీకాలు, కేన్సర్ మందులు, నార్కోటిక్, సైకోట్రోపిక్ ఔషధాలపై క్యూఆర్ కోడ్ నిబంధనలు 2027 జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. యాంటీమైక్రోబియల్ (యాంటీబయోటిక్) మందులపై ఈ నిబంధనలు 2028 జూలై 1 నుంచి అమలవుతాయి.








































