పడితే పడు.. లేచేది మాత్రం గట్టిగా లేవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఈ మాటకు ఉదాహరణగా కనిపిస్తుంది. నాయకత్వం అనేది ఎప్పుడూ గెలవడంలో కాదు.. పడిపోయిన తర్వాత మళ్లీ నిలబడటంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని చూస్తే అర్థం అవుతుంది. ప్రజలు ప్రసంగాలను ఎక్కువకాలం గుర్తుంచుకోరు.. ఫలితాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చరిత్రలో నిలిచిపోయేది కూడా అవే.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామంలో.. 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించారు. చిన్ననాటి నుంచే చురుకుదనం, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలను అలవరుచుకున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా.. కొడంగల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. 2019లో మల్కాజిగిరి లోక్సభ సభ్యుడిగా.. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా.. ఆ తర్వాత 2023లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టారు.

ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. ప్రత్యేక అధ్యాయం అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తన రాజకీయ ప్రస్థానం గురించి భావోద్వేగ పోస్టు పెట్టారు. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు.. మరెన్నో సవాళ్లు.. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తన అనుబంధాన్ని కొనసాగించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల గుండెల్లో రేవంత్ అన్నగా నిలిచిపోయా అన్నారు.

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. రేవంత్ రెడ్డి ప్రస్థానం చర్చనీయాంశంగానే ఉంటుంది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదగడం అనేది సాధారణ విషయం కాదు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథేంటి? ప్రత్యర్థులను అధిగమిస్తూ ఆయన ప్రయాణం సాగిందా? లేక సొంత పార్టీల్లోనే పోటీని ఎదుర్కొంటూ ముందుకు వచ్చారా? రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువుగా చెప్పుకునే చంద్రబాబు పాత్ర ఎంత? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అనుభవం ఆయన నాయకత్వాన్ని ఎలా మలిచింది? భవిష్యత్తులో కూడా తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పడానికి కారణమేంటి? కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానం అంత బలంగా ఉందా? రాజకీయ పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం మారే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉండగా.. రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *