తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొంతకాలంగా విజయ్-సంగీత దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, వారి విడాకుల పిటిషన్‌కు సంబంధించిన తాజా విచారణ ఆసక్తిని రేకెత్తించింది. సోమవారం చెంగల్పట్టు మహిళా కోర్టులో విజయ్, సంగీత దాఖలు చేసిన విడాకుల కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ విచారణకు కూడా ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. దీంతో కేసులో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది.
ఇప్పటికే ఈ కేసు పలుమార్లు వాయిదా పడింది. గతంలో ఏప్రిల్ 20న జరిగిన విచారణకు కూడా విజయ్, సంగీత హాజరుకాకపోవడంతో కోర్టు కేసును జూన్ 15కు వాయిదా వేసింది. తాజాగా జరిగిన విచారణలో కూడా ఇరువురు గైర్హాజరుకావడంతో తదుపరి తేదీని ఖరారు చేసింది.అయితే న్యాయపరమైన పరిణామాల కంటే ప్రస్తుతం కుటుంబ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలే ఎక్కువ చర్చకు దారితీస్తున్నాయి. సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవతో దంపతులను మళ్లీ ఒక్కటి చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇద్దరితోనూ ప్రత్యేకంగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ బాధ్యతలు, కుటుంబ భవిష్యత్తు, పిల్లల సంక్షేమం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర అపార్థాలను తొలగించుకోవాలని పెద్దలు సూచించినట్లు సమాచారం.ఈ ప్రయత్నాలు సానుకూల దిశగా సాగుతున్నాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల సంగీత లండన్ నుంచి చెన్నైకు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆశలను పెంచుతోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విజయ్, సంగీత 1999లో వివాహం చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా కలిసి జీవించిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే ఆగస్టు 7న జరగనున్న తదుపరి విచారణలో కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాల్సి ఉంది.





