ఏపీలో ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతల పోస్టుల్ని పోలీసులు ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు మెయిల్స్ పెట్టి బ్లాక్ చేయిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ పెట్టిన ఓ పోస్టును కూడా ఇలాగే పోలీసులు ఎక్స్ కు మెయిల్ పెట్టి బ్లాక్ చేయించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఈ మెయిల్ లో వారు తమను తాము అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ (FBI)గా అభివర్ణించుకున్నారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ ఎక్స్ లో ట్వీట్ చేశారు. చంద్రబాబు హయాంలో “రెడ్ బుక్ పాలన” అంతర్జాతీయ స్థాయికి చేరిందని, ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే FBIగా అవతారం ఎత్తారని, ఇది నకిలీ గుర్తింపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు కూడా అని జగన్ విమర్శించారు. చంద్రబాబు గారూ, ఇది నిజమైన పోలీసింగ్ విధానమా లేక రాజకీయ కక్షసాధింపు కోసం ప్రభుత్వం చేస్తున్న మోసమా? అని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఉన్న పోస్టులను తొలగించాలని కోరేటప్పుడు, మీ పోలీసు యంత్రాంగం తమను తాము అమెరికాకు చెందిన ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (FBI)గా చెప్పుకోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఇది మన రాష్ట్రం, దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు.

పోస్టులను తొలగించాలన్న అభ్యర్థన FBI నుండి కాకుండా, అధికారిక ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈమెయిల్ అడ్రస్ నుండే వచ్చిందని ఎక్స్ ధృవీకరించిందని పేర్కొన్నారు. అయినా ఆ అధికారి పంపిన సంస్థ పేరుగా ‘FBI’ని పేర్కొన్నారన్నారు. ఈ తొలగింపు అభ్యర్థనను ఎవరు ఆదేశించారు? FBI గుర్తింపును ఎందుకు దుర్వినియోగం చేశారు? మీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్న గొంతులను అణచివేయడానికి ఎక్స్ సంస్థను తప్పుదోవ పట్టించడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమా? అని ప్రశ్నీంచారు. నెరవేరని ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీలు, డీఎస్సీ స్కాం, అమరావతి దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు , వేధింపులు వంటి అంశాలే ఇందుకు కారణమన్నారు. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని రక్షించడానికి ఉద్దేశించినదని, మీ రాజకీయ సెన్సార్‌షిప్‌ను అమలు చేయడానికి కాదని జగన్ గుర్తుచేశారు.

రాజకీయ కారణాలతో పోస్టులను తొలగించే చర్యలో విదేశీ దర్యాప్తు సంస్థ పేరును లాగడం ఆంధ్రప్రదేశ్ పరువు తీయడమే కాకుండా, పోలీసు వ్యవస్థ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. విమర్శకుల గొంతు నొక్కడానికి వెచ్చిస్తున్న శక్తిని, ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీలను నెరవేర్చడానికి ఉపయోగించాలన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడం, నిజమైన ఉద్యోగాలను కల్పించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజలకు నిజంగా అవసరమైన సమస్యలను పరిష్కరించడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా కాలంలో, కట్టుకథలు లేదా తప్పుడు ప్రచారాల వెనుక దాక్కోవడం అసాధ్యమన్నారు. ఈ ప్రభుత్వం తన పనితీరుపై నమ్మకంతో ఉంటే, విమర్శలకు సెన్సార్‌షిప్, వేధింపులతో కాకుండా, సమర్థవంతమైన పనితీరు , పారదర్శకతతో సమాధానం ఇవ్వాలని జగన్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *