పబ్లిక్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఓ జాతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, ఆ పార్టీ నాయకులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని ఓ సీనియర్ ఐపీఎస్‌పై మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆరోపించారు. సదరు ఐపీఎస్ ను కీలక బాధ్యతల నుంచి తప్పించకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని ఓ నివేదిక రూపొందించి, ఏకంగా ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్.. ఓ దక్షిణాది రాష్ట్రానికి గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న క్రమంలోనే ఆయన సిఫారసు మేరకే కీలక పోస్టింగ్ దక్కిందనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ప్రత్యర్థి పార్టీకి నమ్మకస్తుడిలా..
ఇదిలా ఉండగా మరో సీనియర్ ఐపీఎస్ ప్రత్యర్థి రాజకీయ పార్టీతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని, ప్రభుత్వ పరిధిలో జరిగే కీలక నిర్ణయాలు, అంతర్గత అంశాలను ఆ పార్టీ నేతలకు చేరవేస్తున్నారని సీనియర్ అధికారి తీవ్రస్థాయిలో ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలపై నిత్యం ధ్వజమెత్తుతున్నారని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ఎదుట వాపోయినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆ కీలక అధికారిని పదవి నుంచి సాగనంపకపోతే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ నివేదికను కూడా స్వయంగా ప్రభుత్వాధినేతకే సమర్పించినట్టు తెలిసింది.
అయితే తన ఫిర్యాదులను ఎక్కడ కొట్టిపారేస్తారోనని భావించిన సదరు ఐపీఎస్.. ఓ దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రిని రంగంలోకి దించి, ఆయనతోనే ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న సదరు ఐపీఎస్ ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పార్టీ అండదండలు బలంగా ఉన్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పండగ తర్వాత వేటు:
ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌ల కుమ్ములాట ఇప్పుడు ప్రభుత్వ వర్గాలలో హాట్ టాపిగ్గా మారింది. శాఖలో క్రమశిక్షణను గాడిలో పెట్టేందుకు, తారస్థాయికి వెళ్లిన ఈ అంతర్యుద్ధానికి చెక్ పెట్టేందుకు గణపతి నిమజ్జనం తర్వాత ఒకరికి స్థానచలనం కల్పించడం ఖాయమని తెలుస్తోంది.











































