డోన్ నియోజకవర్గంలో ప్రైవేటు హాస్పిటల్ మరియు అధికారుల నిర్లక్ష్యం వ్యవస్థలోని లోపాలను ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరింది. అంతేకాకుండా, ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఒక క్యాన్సర్ బాధితుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. బతికుండగానే రికార్డుల్లో ఆ కుటుంబం మొత్తం మరణించినట్లు నమోదు కావడంతో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స నిరాకరించబడింది.
ఈ ఘటన వివరాలు:
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన బెస్త శ్రీనివాసులు అనే వ్యక్తి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆశతో మొదట ఓమేగా ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. తొలుత ఆరోగ్యశ్రీ ద్వారా అందిన చికిత్సతో ఆ కుటుంబంలో ఆశలు చిగురింపజేసింది. కానీ రెండోసారి సర్జరీ కోసం వెళ్ళినప్పుడు ఆరోగ్య మిత్ర సిబ్బంది చేసిన చిన్న పొరపాటు, ఆ కుటుంబానికి శాపంగా మారింది.
‘మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు, చికిత్సకు 10 లక్షల వరకు ఖర్చవుతుంది’ అని వారు చెప్పిన మాట ఆ కుటుంబంపై పిడుగులా పడింది. ఇప్పటికే ఉన్న పొలాన్ని అమ్మి, అప్పులు చేసి దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఆ కుటుంబానికి, ఇప్పుడు కనీసం ఆపన్నహస్తం అందించే నాథుడు లేడు.
ఒకపక్క ప్రాణనాథుడిని కోల్పోతున్నామేమో అన్న వేదన, పిల్లలకు మరోపక్క చదువు సంధ్యలు లేక, రేపటి భవిష్యత్తు ప్రశ్నార్థకమై ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఉచిత చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించగా.. ప్రభుత్వ రికార్డుల్లో బెస్త శ్రీనివాసులు బతికుండగానే ‘మరణించినట్లు’ నమోదు కావడం చూసి వైద్యులు చికిత్సకు నిరాకరించారు.కనీసం కుటుంబ సభ్యుల కార్డుల ద్వారానైనా చికిత్స చేయిద్దామని ప్రయత్నించగా, రికార్డుల్లో వారి కుటుంబం మొత్తం ‘మరణించారు’ అని ఉండటంతో డబ్బులు ఉంటే వైద్యం చేస్తామని డాక్టర్స్ చేతులెత్తేశారు.
ఇప్పటికే పొలం అమ్మి 35 లక్షలు చికిత్స కోసం ఖర్చు చేశామని, డబ్బులు లేక గత 3 నెలలుగా చికిత్స కోసం ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆ తండ్రిని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటూ.. బాధితుడి కుటుంబ సభ్యులు డోన్ టీడీపీ పార్టీ క్యాంప్ ఆఫీస్ గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ బాధితుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. తక్షణమే ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసి, బాధితుడికి వైద్యం అందేలా చూస్తామన్నారు.

























