మాచర్ల :- పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎతిపోతల జలపాతానికి మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలను ఏర్పాటు చేశారు.రెయిన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో, పర్యాటక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యకలాపాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను
అందజేశారు.

ఎతిపోతల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే ఆకాశంలో సాహసం చేసే అవకాశం జిప్‌లైన్ ద్వారా, ఎత్తైన ప్రదేశంలో సైకిల్ తొక్కుతూ థ్రిల్ పొందే అవకాశం జిప్ సైకిల్ ద్వారా పర్యాటకులకు లభించనుంది. పిల్లల కోసం ఫన్‌జోన్ కార్యకలాపాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన సేఫ్టీ పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బందితో ఈ కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.1.71 కోట్ల పెట్టుబడి పెట్టగా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలగనుంది.ప్రకృతి అందాలకు అడ్వెంచర్ థ్రిల్‌ను జోడిస్తూ.. ఎతిపోతల జలపాతం ఇకపై మరింత ఆకర్షణీయమైన ఫ్యామిలీ, అడ్వెంచర్ టూరిజం డెస్టినేషన్‌గా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *